హైదరాబాద్ : రాష్ట్రంలో గత కొంత కాలంగా వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు ఇలా అనేక రకాలుగా చిత్రహింసలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా భద్రతా విభాగం డీజీపీ గా ఉన్న చారు సిన్హా దీనిపై పూర్తిగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు స్టాండ్ విత్ హర్ అనే హ్యాష్ టాగ్ పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా. విచిత్రం ఏమిటంటే ఓ మైనర్ బాలికపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ వేధింపులకు పాల్పడినట్లు పోక్సో కేసు నమోదైంది. కానీ ఇప్పటి వరకు ఆచూకీ దొరకడం లేదు.
ఇక అసలు విషయానికి వస్తే సామాజిక ఉద్యమంలో పురుషులను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు డీజీపీ చారు సిన్హా. వేధింపుల సమయంలో మౌనం వహించడం కూడా ఒక నేరమని, మహిళలకు అండగా నిలబడటమే ప్రతి పౌరుడి నిజమైన పౌర కర్తవ్యం అనే సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు . రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా చర్చకు దారితీసింది. కేవలం చట్టాలు, పోలీసు నిఘాతో మాత్రమే మహిళల భద్రతను నిర్ధారించలేమని, సమాజంలోని ప్రతి పురుషుడి ఆలోచనా విధానంలో ప్రాథమిక మార్పు వచ్చినప్పుడే శాశ్వత రక్షణ సాధ్యమవుతుందని ఈ ప్రచారం నొక్కి చెబుతోంది. ఈ డిజిటల్ ప్రచారానికి నెటిజన్ల నుండి అద్భుతమైన స్పందన లభించింది. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ మద్దతును తెలియ జేస్తున్నారు.
నటుడు అడివి శేష్ ఇంటర్నెట్‌ను ఒక విశాలమైన సముద్రంతో పోల్చారు. మహిళలపై జరిగే ఆన్‌లైన్ వేధింపులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు, ట్రోలింగ్‌లను దానికి అంటుకున్న ఇసుకగా అభివర్ణించారు. దానిని తుడిచి వేయడానికి ప్రతి పురుషుడు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.