విశ్వ నగరంగా అమరావతిని నిర్మిస్తాం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : విశ్వ న‌గ‌రంగా అమ‌రావ‌తి రాజ‌ధానిని త‌యారు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రం కోసం రాజధాని కోసం భూములిచ్చిన రైతుల భవిష్యత్‌కు అండగా ఉంటాం అన్నారు. రెండో దశలో భూసమీకరణ ద్వారా అమరావతిని భవిష్యత్ నగరంగా నిర్మిస్తాం అని ప్ర‌క‌టించారు. 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వేస్తాం. వెస్ట్ బైపాస్ లాగే మరో 10 నుంచి 15 ఫ్లైఓవర్లు కృష్ణానదిపై రావాలి. రాబోయే 20 ఏళ్లలో ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతి తయారవుతుందని అన్నారు. అమరావతితో పాటు విశాఖను కూడా విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు. రాయలసీమలో ఈ నెల 15 తేదీన డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం అని తెలిపారు. రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌గా, టెక్నాలజీ హబ్‌గా మారుతుందని చెప్పారు సీఎం.

23 నెలల్లో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం అన్నారు. వీటి ద్వారా 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నాం అని చెప్పారు . లక్షమంది ఉద్యోగులను మెడికల్ ఫీల్డ్‌లో తయారు చేయగలిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాం అని వెల్ల‌డించారు. చాలా దేశాల్లో వృద్ధాప్య సమస్య ఉందన్నారు.. వైద్యుల కంటే నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి డిమాండ్ ఉందన్నారు. ఈ రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. ఏ దేశంలో ఎక్కువ డిమాండ్ ఉంటుందో అక్కడికి వెళ్లి సేవలు అందించేలా ఆయా దేశాల భాషను నేర్చుకోవాలని సూచించారు సీఎం.

Leave A Reply

Your Email Id will not be published!