హైదరాబాద్ : ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్త్రి నిధి బ్యాంకు మహిళలకు ఆలంబనగా నిలుస్తోందని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి సీతక్క. ప్రజాభవన్‌లో జరిగిన ‘స్త్రీ నిధి యాన్యువల్ యాక్షన్ ప్లాన్’ అమలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ మహిళలకు “స్త్రీ నిధి” ఒక నమ్మకమైన బ్యాంక్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. మైక్రో ఫైనాన్స్ వేధింపుల నుండి మహిళలకు విముక్తి కల్పించడానికే “స్త్రీ నిధి” ఏర్పాటయిందని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 24 వేల కోట్ల రుణాలను 32 లక్షల మంది మహిళలకు అందించడం జరిగిందన్నారు. వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడిందని మంత్రి కొనియాడారు. “తెలంగాణ స్త్రీ నిధి” మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని సీతక్క పేర్కొన్నారు.
సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు చేసే తప్పుడు ఆరోపణలపై వెంటనే వెరిఫై చేసి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటైన “స్త్రీ నిధి” ఉద్యోగ సంక్షేమ సంఘాన్ని అభినందిస్తూనే… ఉద్యోగులు హక్కులతో పాటు విధులను కూడా గుర్తుంచు కోవాలని అన్నారు. సంస్థను అందరం కలిసి కాపాడు కోవాలని పిలుపునిచ్చారు సీతక్క. చిన్న వ్యాపారాలు, గృహాధారిత ఉపాధితో పాటు ఆదివాసీ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. “స్త్రీ నిధి” ఏర్పాటు విజయవంతం కావడంలో కృషి చేసిన వారందరినీ మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సిఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.