హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తమిళనాడు సీఎం, ప్రముఖ నటుడు , టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించిన చిత్రం జన నాయగన్ పై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే కంటే ముందు ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ అటు అప్పటి డీఎంకే సర్కార్, సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో రిలీజ్ కాకుండా నిలిచి పోయింది. ఇక ఎన్నికల్లో ఫుల్ బిజీగా ఉండడంతో దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టలేక పోయారు దళపతి విజయ్. తనతో పాటు ప్రముఖ నటి పూజా హెగ్డే ఇందులో కీలక పాత్ర పోషించింది. అయితే నిర్మాతలు భారీ ఎత్తున జన నాయగన్ కోసం ఖర్చు చేశారు. ఈసినిమా ఉన్నట్టుండి విడుదల కాకుండా ఆగి పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక డీఎంకే సర్కార్ మరోసారి పవర్ లోకి వస్తుందని అంతా భావించారు. కానీ తమిళనాడు రాష్ట్ర ప్రజలు కాస్తా గతంలో కంటే భిన్నంగా ఆలోచించారు. తమకు ప్రత్యామ్నాయంగా తమ కోసం ఆలోచించి, పని చేసే వ్యక్తి కావాలని కోరుకున్నారు. కేవలం టీవీకే పార్టీని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలైంది. కానీ ప్రజలు మిగతా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే, అన్నాడీఎంకేలకు షాక్ ఇచ్చారు. టీవీకే పార్టీకి 234 సీట్లకు గాను 108 సీట్లను కట్టబెట్టారు. దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్. దీంతో తను నటించిన జన నాయగన్ చిత్రం విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఫ్యాన్స్ తో పాటు నిర్మాతలు ఆశిస్తున్నారు.