తిరుపతి : నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. అత్యంత ప్రాధాన్యమైన గరుడ వాహన సేవ రాత్రి వైభవోపేతంగా జరిగింది. సర్వాభరణ భూషితుడై, దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో వెలుగొందిన శ్రీ కల్యాణ శ్రీనివాసుడు గరుడునిపై ఆసీనుడై గ్రామ వీధుల్లో విహరించి భక్త జనులను అనుగ్రహించారు. స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించు కునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి, “గోవిందా… గోవిందా…” నామ స్మరణలతో ఆ ప్రాంతాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. గరుడ వాహనంపై స్వామి వారి విహారం కనుల పండువగా సాగి భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించింది.
పౌరాణిక సంప్రదాయంలో 108 వైష్ణవ దివ్య దేశాలలో గరుడ సేవకు విశిష్టమైన స్థానం ఉంది. గరుడుడు జ్ఞాన, వైరాగ్యాలకు ప్రతీకగా భావించ బడతాడు. గరుడ వాహనంపై విహరించే శ్రీమన్నారాయణుడు తన భక్తుల పట్ల ఉన్న అపార కరుణను చాటుతూ, దాసానుదాస ప్రపత్తి మహిమను లోకానికి తెలియ జేస్తాడు. గరుడుని దర్శించడం ద్వారా సర్వపాపాలు నశించి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, చెగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.