పల్లకిపై దివ్య విహారం భక్తులకు ఆధ్యాత్మిక పరవశం

మంత్ర ముగ్ధులను చేసిన కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి : నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు క‌నుల పండువ‌గా కొనసాగుతున్నాయి. స్వామి వారు మోహినీ అలంకారంలో పల్లకిపై దివ్యంగా విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు గ్రామ వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో గోవింద నామస్మరణ చేస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి పల్లకి సేవ అత్యంత వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని పులకించి పోయారు.

అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీమహా విష్ణువు మోహినీ అవతారాన్ని ధరించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. మోహినీ అలంకారంలో శ్రీనివాసుని దర్శించుకున్న భక్తులు మాయా బంధాలను అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తోంది. బ్రహ్మోత్సవాల‌ను పుర‌స్క‌రించుకుని అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవ రాత్రి 7 గంటలకు ప్రారంభ‌మైంది. గరుడునిపై కొలువుదీరే స్వామివారిని దర్శించు కునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆద్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!