ముంబై : స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్ స్టార్ తో జరిగిన బిలీవ్ కార్యక్రమం సందర్బంగా ముచ్చటించాడు . రోహిత్ శర్మ చూసిన పాజిటివ్ కోణాన్ని తాను చూడలేక పోయానని పేర్కొన్నాడు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 ప్రారంభంలో జట్టు నుండి తొలగించడటం నుండి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలవడం వరకు సాగిన తన ఒడిదుడుకుల ప్రయాణం గురించి సంజు శాంసన్ వివరించారు. నిరాశాజనకమైన న్యూజిలాండ్ సిరీస్, తనకంటే ముందు ఇషాన్ కిషన్ ప్రాధాన్యత పొందడం, ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’లో వెస్టిండీస్‌పై ఆడిన ఇన్నింగ్స్ గురించి ప్రస్తావించారు. తన కెరీర్‌లోని ఎత్తుపల్లాల గురించి సంజు శాంసన్ మనసు విప్పి మాట్లాడారు.
వాస్తవానికి భారతీయ క్రికెటర్‌గా ఉండటంలోని అసలు మజా అదే. ఒక్క రోజులోనే అన్నీ మారిపోవచ్చు. నా విషయంలోనూ అదే జరిగింది. నాకు ఆ ఏడు మ్యాచ్‌లు లభించినప్పుడు, ఆ ఏడు ఆటలలో మూడు సెంచరీలు చేస్తానని నేనైనా ఊహించి ఉండక పోవచ్చు. కాబట్టి, నాకంటే ముందు ఉన్న వ్యక్తి కూడా కొంతకాలం తన స్థానాన్ని కోల్పోయాడు. నేను 2015లో అరంగేట్రం చేశాను, కాబట్టి జట్టులోకి రావడం-పోవడం, ఎత్తుపల్లాలు అనేవి నా ప్రయాణంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. నేను పరుగులు సాధించినప్పుడు ఇక నీకు తిరుగులేదు, నువ్వు స్థిరపడ్డావు, T20Iలలో నీ స్థానాన్ని ఖాయం చేసుకున్నావు అని చాలా మంది అనే వారు. కానీ నా మనసులో మాత్రం నేను దాన్ని నమ్మలేక పోయేవాడిని. అది నిజమేనా అనిపించేది. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ జరిగింది. ఈ T20 ఫార్మాట్ చాలా విచిత్రమైన ఆట.
ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించు కోవాలనే లక్ష్యం నా కళ్ల ముందే ఉందని భావించి, నేను నా సర్వస్వం ధారపోసి, పిచ్చివాడిలా ప్రాక్టీస్ చేశాను. అంత కష్టపడిన తర్వాత కూడా, ఐదు మ్యాచ్‌లలో నా అత్యధిక స్కోరు కేవలం 24 మాత్రమేనని పేర్కొన్నాడు శాంసన్. నేను అతిగా శ్రమిస్తున్నానని నాకు అర్థమైంది. గంటల తరబడి సాధన చేయడం కంటే సంతోషంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండటమే ముఖ్యమని నా భార్య చెప్పింది నిజమేననిపించింది. న్యూజిలాండ్ సిరీస్ నాకు ఆ విషయాన్ని నేర్పింది. ఆ తర్వాత ఇషాన్ వచ్చాడు, అతని ప్రస్థానం పూర్తిగా భిన్నంగా సాగింది. అసలు అతను జట్టులోనే లేడు. జార్ఖండ్‌కు దాదాపు ఒంటరి పోరాటంతో ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ’ని గెలిపించాడు, ఆపై భారత జట్టులోకి వచ్చి అద్భుతమైన ఫామ్‌తో బ్యాటింగ్ చేశాడు. ప్రాధాన్యత క్రమంలో ఇషాన్ నాకంటే ముందు వరుసలోకి వెళ్తున్నాడని నాకు స్పష్టంగా తెలిసింది.
ఎవరైనా సరే మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌నే ఎంచుకుంటారు. ప్రపంచ కప్ అవకాశాలు నాకు ఇక లేవని స్పష్టమైంది. జరగాల్సింది జరిగిపోయింది, ఇక నేను చేయగలిగింది ఒక్కటే . నిశ్శబ్దంగా కూర్చుని చప్పట్లు కొట్టడం. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026లో తనకు తర్వాత అవకాశం లభించ వచ్చని రోహిత్ శర్మ చెప్పిన విషయంపై స్పందించాడు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో నేను ఆయన మాటలను నమ్మలేదు మనసులో విషయాలను దాచుకోవడం నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నేను పూర్తిగా ఉత్సాహంగా లేనప్పుడు అది నా ముఖంలోనే తెలిసి పోతుంది. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ముందు నేను నాలుగు లేదా ఐదు రోజుల పాటు ఆ దశను ఎదుర్కొన్నాను. విఫలమయ్యామని మనకు తెలుసు, మరి తర్వాత ఏంటి? మనం అట్టడుగున ఉన్నప్పుడు, అక్కడి నుంచి పైకి వెళ్లడమే ఏకైక మార్గం.
నేను మానసికంగా నన్ను నేను సరిదిద్దు కోవడం మొదలు పెట్టాను. నన్ను నేను ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాను – నేను క్రికెట్ ఎందుకు ఆడుతున్నాను? నా లక్ష్యం ఏమిటి? ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలోనే నేను నన్ను నేను కొత్తగా ఆవిష్కరించు కుంటున్నట్లు అనిపించింది. ఆ తర్వాత అంతా మళ్లీ గాడిలో పడింది అన్నాడు సంజు శాంసన్. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ తర్వాత ఆ ఆట కోసం నేను చాలా మెరుగ్గా సన్నద్ధమయ్యాను. ఐపీఎల్ , భారత జట్టు తరపున ఆడుతూ నేను సెంచరీలు సాధించిన సందర్భాల్లో, అన్నీ అనుకూలంగా అనిపించే రోజులు కొన్ని ఉంటాయి. ఇది కూడా అలాంటి రోజుల్లో ఒకటి. ఆ సమయంలో మనం కేవలం ఆటను ఆస్వాదిస్తూ, ఆ క్షణంలో లీనమై, ప్రక్రియపై దృష్టి పెడితే చాలు… అన్నీ వాటంతట అవే జరిగి పోతాయి. అది భారత్‌కు చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా నాకు తెలుసు. సాధారణంగా పవర్‌ప్లే ముగిసిన తర్వాత నేను దూకుడు పెంచుతాను.
నేను ఓపెనర్‌ని కాబట్టి, పవర్‌ప్లేను విజయవంతంగా దాటిన తర్వాత, మా జట్టులో 8వ స్థానం వరకు బ్యాటింగ్ చేసేవారు ఉన్నప్పుడు, బౌలర్లపై ఎదురుదాడి చేయడం నా వ్యూహంగా ఉంటుంది. కానీ ఆ మ్యాచ్‌లో, నేను ఎప్పుడైతే దాడి చేయాలని అనుకున్నానో, అప్పుడల్లా అవతలి వైపు వికెట్ పడిపోయేది. అప్పుడే నాకు అర్థమైంది ఆటే అత్యుత్తమ గురువు అని. ఏం చేయాలో ఆ ఆటే మనకు చెబుతుందని అన్నాడు శాంసన్.
