హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టిన ఆరోపణల కేసులో హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జనరల్ మేనేజర్ కుమార్ కు చెందిన సంబంధిత ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు నిర్వహించింది. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు ఎనిమిది చోట్ల విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఈ దాడుల సందర్భంగా ఏసీబీ అధికారులు రూ. 1.05 కోట్ల నగదుతో పాటు భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల సమయంలో ఆస్తి పత్రాలను కూడా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం కుమార్ దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీటిలో హైదరాబాద్లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మూడు ఫ్లాట్లు, నగర శివార్లలోని ఆరు ఖాళీ స్థలాలు (ఓపెన్ ప్లాట్లు), నిజామాబాద్లో సుమారు మూడు ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోని మల్లాపూర్లో ఉన్న కుమార్ నివాసంతో పాటు, ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంగణాల్లోనూ ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. దర్యాప్తులో భాగంగా అధికారులు త్వరలోనే బ్యాంకు లాకర్లను కూడా తెరిచి తనిఖీ చేసే అవకాశం ఉంది. ఈ దాడులు కుమార్ బంధువుల ఇళ్లకు కూడా విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, స్వాధీనం చేసుకున్న ఆస్తుల మొత్తం విలువను అధికారికంగా నిర్ధారించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.