అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

వ్యవసాయం, అనుబంధ శాఖలపై సీఎం సమీక్ష

అమరావతి : ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. దీనిని సమర్థవంతగా అమలు చేస్తూ 2030-31 నాటికి 40 లక్షల మంది రైతులు, 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టేలా చూడాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు నారా చంద్ర‌బాబు నాయుడు. రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, దీంతో రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలన్నారు. అలాగే వ్యవసాయ విద్యార్ధులు ప్రకృతి సాగు చేయడం ద్వారా దాని వల్ల వచ్చే ఫలితాలను స్వయంగా తెలుసుకునేలా చేయాలన్నారు.

ప్రకృతి సాగుకు సంబంధించి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ వంటివి ఈ ఏడాది ఏప్రిల్ కల్లా వచ్చేలా చూడాలని ఆదేశించారు. అలాగే జూన్ నాటికి రాష్ట్రమంతటా పూర్తి కావాలని ముఖ్యమంత్రి సూచించారు. సుభాష్ పాలేకర్‌తో రాష్ట్రమంతటా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సీఎం చెప్పారు. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా అధికంగా ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం కారణంగా రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రాంతాల్లో సంప్రదాయ పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించాలని స్ప‌ష్టం చేశారు.

ఏఐ ఆధారిత క్రాప్ అడ్వయిజరీ ‘భారత్ విస్తార్’ వంటి వాటిని రాష్ట్రంలోనూ వినియోగించు కోవాలన్నారు. రాయలసీమలో ఒకప్పుడు నీటి సమస్య ఉండేద‌న్నారు. కానీ సమర్ధ నీటి నిర్వహణతో ఈ ఏడాది ఆ సమస్యను తీర్చామ‌న్నారు. అన్ని రిజర్వాయర్లు నింపడంతో సాగునీటికి లోటు లేకుండా చేశామన్నారు. యూఎస్, ఈయూతో ట్రేడ్ ఒప్పందం నేపథ్యంలో రాష్ట్రం నుంచి రొయ్యలు, ఎండుమిర్చి, మామిడి, వరి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు పెంచుకునేందుకు మరింత అవకాశం కలిగిందని వ్య‌వ‌సాయ శాఖ అధికారులు వివ‌రించారు.

Leave A Reply

Your Email Id will not be published!