తిరుపతి : కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాలకు ముందుగా జూన్ 2వ తేదీ ఉదయం 7:30 నుండి 11:30 గంటల వరకు స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేయనున్నారు.
నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 7:30 నుండి 9:30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి వారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. జూన్ 6వ తేదీన ధ్వజారోహణం (ఉదయం 8:10 నుండి 8:45 వరకు కర్కాటక లగ్నం), రాత్రి పెద్దశేష వాహనం, 7న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 8న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 9న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి సర్వ భూపాల వాహనం నిర్వహించనున్నారు.
జూన్ 10వ తేదీన ఉదయం మోహినీ అవతారం, రాత్రి మహాగరుడ వాహనం, 11న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం, 12న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 13న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం, 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం జరగనుంది.