పోటెత్తిన భ‌క్తులు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా నీరు, అన్న ప్ర‌సాదం

తిరుమ‌ల : వేస‌వి ర‌ద్దీ నేప‌థ్యంలో శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ నెల‌కొన‌డంతో భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాట గంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది.
అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ పనులు, అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు. ఇదే సమయంలో నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు నేల వేడి నుండి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు. బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

టీటీడీ అన్న ప్ర‌సాద విభాగం ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా తాగునీరు, అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేస్తున్నారు. ఉద‌యం అల్పాహారంగా పాలు ఉప్మా, పొంగ‌ల్‌, మ‌ధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర‌, ట‌మోట రైస్‌, రాత్రి పాలు ఉప్మా, సాంబార‌న్నం భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా అంద‌జేస్తున్నారు. అదేవిధంగా టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. ర‌ద్దీకి అనుగుణంగా ఔట‌ర్ రింగ్ రోడ్డులో క్యూలైన్ల వెంబ‌డి ఒక మొబైల్ ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ అందుబాటులో ఉంచారు.

Leave A Reply

Your Email Id will not be published!