హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు నూరైనా సరే రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఈరోజు కోర్టుకి హాజరు కావాల్సిందేనని ఆదేశించారు పైకోర్టు జడ్జీ రాజేశ్వర రావు. వందలాది మంది తెలంగాణ విశ్రాంత ప్రభుత ఉద్యోగులు తమ పదవీ విరమణ బాకాయిలు దాదాపు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదని గత ఏడాది కోర్టుని ఆశ్రయించారు. అందుకు స్పందిస్తూ న్యాయమూర్తి ఆ బాకాయిలను తక్షణమే చెల్లించాలని గత ఏడాది ఆదేశాలు జారీ చేశారు. తను ఆదేశించి ఏడాదికి పైగా గడిచినా ఇప్పటి వరకు చెల్లింపులు జరపక పోవడం పట్ల మండిపడ్డారు. దీనిని సవాల్ చేస్తూ విశ్రాంత ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కార నేరం కింద ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిపై చర్యలు కోరుతూ పిల్ దాఖలు చేశారు.
గత గడువు సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరై కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఆ మేరకు ఫాం వన్ కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి మాత్రం సోమవారం కూడా కోర్టుకి హాజరు కాలేదు. కొంతమంది ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ, అకవున్టేంట్ జనరల్ ఆఫీసుల తరపున కోర్టుకి హాజరు అయ్యారు. కోర్టు ఆదేశాల అమలు కోసం గతంలో చాలా సార్లు విజయవంతంగా కోర్టు ద్వారా గడువులు పొందిన ప్రభుత్వ న్యాయవాది ఈరోజు కూడా ఆర్థిక కార్యదర్శి కోసం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ అభ్యర్థించడంపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“బకాయిలు చెల్లించాల్సిందిగా కోర్టు గత ఏడాది ఆదేశాలు ఇచ్చింది. వాటిని ఇప్పటి వరకూ పూర్తిగా ప్రభుత్వం అమలు పరచలేదు. కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై నోటీసులు జారీ చేసికూడా ఆరు నెలలు దాటింది. ఈ కాలంలోనే పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించిన వార్తలు వచ్చాయి. వ్యక్తిగతంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో మునిగి ఉన్నారని, కోర్టుకి రాలేక పోయారన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఉన్న సంగతి వాళ్లకి ముందే తెలిసినందున అలాంటి విన్నపం ఏదైనా ఉంటే ముందే సమర్పించి ఉంటే కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేదనీ, అలా చేయక పోవడాన్ని ఈరోజు మాత్రం ఉపేక్షించేది లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈరోజు ఆరు నూరైనా ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. కావాలంటే ఈరోజు అర్థరాత్రి వరకైనా కావాలంటే నేను కోర్టు హాల్లోనే వేచి చూస్తాను. వ్యక్తిగత హాజరు నుంచి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదు అని జడ్జి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
