అమరావతి : ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మర్యాద పూర్వకంగా సచివాలయంలోని సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. ఇదే క్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డులు , “ఆయుష్మాన్ వయో వందన కార్డ్” లను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు పీవీఎన్ మాధవ్.
ప్రత్యేకంగా, సీనియర్ సిటిజన్ కార్డులు, ఆయుష్మాన్ వయో వందన కార్డులను అనేక ఆసుపత్రులలో అంగీకరించక పోవడం వల్ల వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు మాధవ్. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని, అన్ని సంస్థలు ఈ కార్డులను స్వీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు బీజేపీ చీఫ్.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సేవలందిస్తున్న హోం గార్డుల సంక్షేమానికి సంబంధించిన అంశాలు, అదే విధంగా ఏపీలోని తీర ప్రాంతమైన నెల్లూరు, ఒంగోలు, బాపట్ల ప్రాంతాల్లోని మత్సకారులకు పొరుగున ఉన్న తమిళనాడు కడలూరు కారేకల్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడి వారికి ఇబ్బందులు సృష్టిస్తున్న విషయాన్ని కూడా ఏకరువు పెట్టారు. శాంతిభద్రతలకు భంగం కలుగచేస్తున్న సంఘటనల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమిళనాడు మత్స్యకారులు స్పీడు బోట్లతో ఆంధ్ర తీర ప్రాంతంలో మత్స్య సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు.
