ట్రెండ్ సెట్ చేసిన మ‌హానాడు -2026

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శ్రీ‌నివాస రావు

అమ‌రావ‌తి : మహానాడు-2026 ఘన విజయంపై హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఈ మహానాడు గిన్నిస్ రికార్డు స్థాయిలో విజయవంతం అవుతుందని తాను ముందుగానే చెప్పానని, అయితే తన అంచనాలకు మించి కార్యకర్తలు చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ సమావేశం కాదని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అంకితభావం, క్రమశిక్షణ, సాంకేతికత పట్ల ఉన్న అవగాహన, పార్టీపై ఉన్న ప్రేమకు ప్రతీకగా నిలిచిందన్నారు.

దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ నిర్వహించిన అతిపెద్ద డిజిటల్ రాజకీయ మహాసభగా మహానాడు-2026 నిలిచిందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 1,875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా… 24.50 లక్షల మంది వర్చువల్‌గా భాగస్వామ్యం కావడం ద్వారా మహానాడు సరికొత్త రికార్డులు సృష్టించిందన్నారు. పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచ రాజకీయ పార్టీలకు సైతం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

1982లో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీని మోసింది, మోస్తోంది, భవిష్యత్తులో మోయబోయేది కార్యకర్తలేనని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా సిద్ధాంతం కోసం, జెండా కోసం, నాయకత్వం కోసం ప్రాణాలు సైతం అర్పించే కార్యకర్తల సైన్యం తెలుగుదేశం పార్టీ సొంతమని కొనియాడారు. గత ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనలో వేధింపులు, అక్రమ కేసులు, ఆర్థిక నష్టాలు ఎదురైనా పార్టీ జెండాను వదలకుండా నిలిచిన ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. మెడపై కత్తి పెట్టినా “జై తెలుగుదేశం” అని ప్రాణత్యాగం చేసిన కార్యకర్తల త్యాగాల పునాదులపైనే ఈ పార్టీ నిలిచిందన్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరోసారి “కార్యకర్తే అధినేత” అన్న నినాదాన్ని ఆచరణలో చూపించారని పల్లా తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లకు పైగా ఖర్చు చేయడం, వారి కుటుంబాల విద్య, నైపుణ్యాభివృద్ధి, సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడం చంద్రబాబు నాయకత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు. హైబ్రిడ్ మహానాడును విజయవంతంగా నిర్వహించడం వెనుక పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కృషి విశేషమని పల్లా కొనియాడారు. సాంకేతికతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానం చేస్తూ ప్రతి కార్యకర్తను నేరుగా నాయకత్వంతో కలిపిన ఈ విధానం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!