చంద్రబాబు సార‌థ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు దూరదృష్టి నాయకత్వం ఫలితమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన తరువాత రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యేలు వ్య‌వ‌సాయం, అనుబంధ శాఖ‌ల‌పై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి అచ్చెన్నాయుడు స‌మాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం నిజమైన స్వర్ణ యుగాన్ని పొందిందని, రైతులకు నేరుగా లాభాలు, ఆధునిక సాగు పద్ధతులు, పంటల మార్కెటింగ్ సౌకర్యాలు లాంటి సమగ్ర పథకాలు రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తున్నాయని తెలిపారు.

సీఎం చంద్రబాబు సంకల్పం, దృఢమైన నాయకత్వం ఫలితంగా ప్రతి పంటలోనూ, ప్రతి రైతులోనూ గర్వం, నమ్మకాన్ని పెంపొందిస్తూ, వ్యవసాయ రంగాన్ని అత్యాధునిక శిఖరాలకు చేరుస్తోందని అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్ర‌ధానంగా తీసుకుని, బీమా, రుణ సౌకర్యం, పరిశోధనాత్మక పద్ధతులు వంటి పథకాలను మరింత బలోపేతం చేసిందని, ప్రతి రైతు, వారి కుటుంబాలు దీని ద్వారా నేరుగా లాభాలు పొందుతున్నార‌ని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వికసిత భారత్–2047 లక్ష్యాలకు అనుసంధానంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమగ్ర ప్రగతి దిశగా తీసుకెళ్లి 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ప్రజల తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం “స్వర్ణాంధ్ర – 2047” ప్రణాళికను రూపొందించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!