కుప్పం : ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలతో సమావేశమయ్యారు. 4వ రోజు పర్యటనలో ముందుగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని కుప్పంలో కోదండరామ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాల్య స్నేహితుడు చంద్రశేఖర్ ఇంటికి భువనేశ్వరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ఎన్టీఆర్ స్పూర్తితో, సీఎం చంద్రబాబు సహకారంతో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ట్రస్ట్ బాధ్యతలు నాకు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు అందించిన స్పూర్తితో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం అని అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మా వంతు సాయం అందిస్తున్నాం అని పేర్కొన్నారు. దాతలు కూడా మాకు సాయంగా నిలుస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే విజయవాడ , అనంతపురంలో కూడా తలసేమియా సెంటర్లు ప్రారంభిస్తాం అన్నారు.
