చెన్నై : మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలనంగా మారారు. ఆయన శాసన సభ సాక్షిగా సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య విభేదాలను, ద్వేషాలను సృష్టించే ఈ ధర్మం పూర్తిగా అధర్మం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సనాతన ధర్మం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జాతీయ గీతం, ‘వందేమాతరం’ ఆలపించిన తర్వాతే ‘తమిళ తాయ్ వాళ్తు’ను పాడటం ద్వారా దానిని మూడవ స్థానానికి నెట్టివేశారని ఆరోపించారు. పక్కన పెట్టేసిన తీరును ప్రతిపక్షం అనుమతించదని ఆయన పేర్కొన్నారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తాను గతంలో చేసిన పిలుపుపై మూడేళ్లకు పైగా కొనసాగుతున్న వివాదం దాదాపు చల్లారిపోతున్న తరుణంలో ఉదయనిధి స్టాలిన్ దానిని మళ్ళీ రాజేశారు. ప్రజలను విభజిస్తోంది కాబట్టి సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిందేనని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష నాయకుడిగా సభలో తన తొలి ప్రసంగం చేస్తూ, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ‘తమిళ తాయ్ వాళ్తు’ కంటే జాతీయ గేయం ‘వందేమాతరం’కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రస్తావించారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలోనూ తమిళ ప్రార్థనా గీతానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
