వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన కాష్ పటేల్ సంచలనంగా మారారు. ఆయన అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందారు. పనితీరులో టాప్. దీంతో తనకు ఏరికోరి పదవి ఇచ్చారు. ఈ సమయంలో తను విధుల్లో ఉన్నప్పుడు సైతం మద్యం తాగి వస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ది అట్లాంటిక్ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురింది. ఈ స్టోరీ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనిపై సీరియస్ గా స్పందించాడు ఎఫ్ బీఐ డైరెక్టర్ కాష్ పటేల్. దీనిని తీవ్రంగా ఖండించారు. తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో జరిగిన బడ్జెట్ విచారణలో ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఒక డెమోక్రటిక్ చట్టసభ్యుడిపై మండిపడ్డారు. తాను ఉద్యోగంలో ఉండగా అధికంగా మద్యం సేవిస్తానని, కొన్నిసార్లు తన సిబ్బందికి అందుబాటులో ఉండరని వచ్చిన ఆరోపణలు నిస్సందేహంగా, పూర్తిగా అబద్ధం అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అత్యున్నత ఫెడరల్ చట్ట అమలు సంస్థకు ఆయన నాయకత్వాన్ని ప్రతికూలంగా చిత్రీకరించిన ‘ది అట్లాంటిక్’ పత్రికలోని ఇటీవలి కథనం గురించి మేరీల్యాండ్ డెమోక్రటిక్ నాయకుడు సెన్. క్రిస్ వాన్ హోలెన్ నిలదీశారు.
మీడియా చేసే నిరాధారమైన ఆరోపణలు, మోసపూరిత ప్రకటనల వల్ల నా ప్రతిష్టకు భంగం కలగదు అని పటేల్ అన్నారు. ఆ కథనంపై పటేల్ ఏకంగా 250 మిలియన్ డాలర్ల దావా వేశారు. తాము తమ రిపోర్టింగ్‌కు కట్టుబడి ఉన్నామని, ఈ ప్రామాణికం లేని దావాను గట్టిగా ఎదుర్కొంటామని అట్లాంటిక్ పత్రిక ప్రకటించింది.