సిద్దిపేట జిల్లా : తెలంగాణలో కొలువు తీరిన ప్రజా పాలన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇందులో భాగంగా భారీ ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలో రూ.700 కోట్ల సీబీజీ ప్లాంట్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును జూనో జౌల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ‘కంప్రెస్డ్ బయో-గ్యాస్’ ప్లాంట్ ఏర్పాటు కోసం శంకుస్థాపనం చేయడం సంతోషంగా ఉందన్నారు శ్రీధర్ బాబు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య విశేషాలలో ఒకటి ఏమిటంటే, దీని ద్వారా సుమారు 1,400 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో పనిచేసేవారిలో 30 శాతం మంది మహిళలే ఉంటారని వెల్లడించారు మంత్రి దుద్దిళ్ల. ఇది సమ్మిళిత వృద్ధి పట్ల ఉన్న బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మూడు దశల్లో, క్లస్టర్-ఆధారిత నమూనాలో అమలు చేయబడుతుందని చెప్పారు. ఒక్కోటి రోజుకు 100 టన్నుల సామర్థ్యం కలిగిన మొత్తం 10 సీబీజీ ప్లాంట్లు అభివృద్ధి చేయబడతాయని వెల్లడించారు. మొదటి , రెండవ దశల్లో ఒక్కోదానిలో మూడు ప్లాంట్ల చొప్పున, మూడవ దశలో నాలుగు ప్లాంట్లు ఏర్పాటు చేస్తారన్నారు. ఈ ప్లాంట్లు వరి గడ్డి, పశువుల పేడ , కోళ్ల వ్యర్థాల వంటి సుస్థిర ముడి పదార్థాలను ఉపయోగించి బయో ఫ్యూయల్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయని స్పష్టం చేశారు.
