హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి. దీంతో పెద్ద ఎత్తున ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. ఈ జిల్లా అభివృద్ది కోసం ఎక్కువ నిధులు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ప్రధానంగా పారిశ్రామికంగా మరింత ఎదిగేలా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ తరుణంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడింది సర్కార్. మంగళవారం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష చేపట్టారు సీఎం . పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. దీనితో పాటు, జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియలను కూడా వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా, ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రాజెక్టుల కోసం చేపట్టే భూసేకరణకు సంబంధించిన నిధుల చెల్లింపులు ఎటువంటి జాప్యం లేకుండా, తక్షణమే జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఉమ్మడి
పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు వాటి పురోగతిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జిల్లా మంత్రులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.