కర్ణాటకలో సీఎం ఎంపిక తలనొప్పిగా మారింది సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి. మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య నువ్వా నేనా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ తరుణంలో ఏఐసీసీ మల్లగుల్లాలు పడుతోంది. బంతి చివరకు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేతిలోకి వచ్చింది.
ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. సీఎం ఎవరనే దానిపై యుద్దం కొనసాగుతున్న తరుణంలో 34 మంది ఎమ్మెల్యేలు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారున్నారనే వాదన కొత్తగా వచ్చింది. ఇదిలా ఉండగా అఖిల భారత వీరశైవ మహాసభ అత్యున్నత పదవికి వేలం వేసింది.
ఒకప్పుడు బీజేపీకి కీలక మద్దతుదారుగా ఉన్న లింగాయత్ ఓటర్లు ఈసారి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లారు. ఈ మేరకు అఖిల భారత వీరశైవ మహాసభ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది. 46 మంది లింగాయత్ లను నిలబెడితే అందులో 34 మంది గెలిచారని పేర్కొంది. ఈ సంఘానికి అధ్యక్షుడు 91 ఏళ్ల శివ శంకరప్ప. ఈసారి దావణగెరెసౌత్ నుంచి విజయం సాధించిన కర్ణాటకలోని అత్యంత పాత తరం ఎమ్మెల్యే.
లింగాయత్ లకు భారతీయ జనతా పార్టీ నుండి మాజీ సీఎం బీఎస్ యడ్యూర్ప ఉన్నారు. ఇక ఈసారి వారు తీవ్ర అవమానాలకు గురైనట్లు భావించారు. అందుకే తమ ఓట్లను కాంగ్రెస్ కు వేశారు.
