లాక్ డౌన్ 5 నిబంధనల సడలింపు, కేంద్ర నిబంధనల నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోనున్నాయి..అలా అక్టోబరు 15 నుంచి మూతపడిన థియేటర్లు మళ్లీ తెరచుకోనున్నాయి. అయితే ఎంతవరకు సినిమా హాళ్లకు వెళ్లి జనం చూస్తారా? అన్నది ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. ప్రస్తుతం నిబంధనల నేపథ్యంలో రోజుకి రెండు ఆటలు ప్రదర్శించేందుకు మాత్రమే అవకాశం ఉంది.
అలాంటప్పుడు కరెంటు ఛార్జిలు, థియేటర్ల రెంట్ లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఒక ఆట అయిపోయిన తర్వాత.. థియేటర్ అంతా శానిటైజేషన్ చేయాలంటే మాటలా? దానికెంత ఖర్చవుతుంది.. జనరల్ గా చూస్తే బాత్ రూమ్ లే శుభ్రం చేయని థియేటర్ యాజమాన్యాలు..ఆట ఆటకి శానిటైజ్ చేస్తాయంటే నమ్మవచ్చా? ప్రభుత్వం నడిపే ఆర్టీసీ బస్సులు కూడా పైకి చెప్పినంత అందంగా శానిటైజేషన్ అయి రావడం లేదనేది అందరికీ తెలిసిన నిజం..ఇవన్నీ కలిపితే..టిక్కెట్టు ధర గిట్టుబాటు అవుతుందా? అనేది చూడాల్సిందే..
మరి అలాంటప్పుడు రేట్లు పెంచుతారా? అసలే కరోనా భయంతో థియేటర్లకి రారు అని అనుకుంటుంటే..ధరలు పెంచితే సినిమా చూస్తారా? అనేది ఒక ఆలోచన.. అంతకుమించి కరోనా కష్టాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. వారి జీవన గమనం తడబడుతూనే ఉంది. ఇంకా చేతిలో డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ధరలు పెంచితే వారు థియేటర్ కి వచ్చి చూసేందుకు ఆసక్తి చూపిస్తారా? అనేది మరొక ప్రశ్న. ఇన్ని ప్రశ్నల మధ్య అందరూ ఓటీటీ నుంచి మనసులు మార్చుకొని థియేటర్ల వైపునకు వచ్చేస్తున్నారు. అయితే కరోనా కష్టాలను అధిగమించి ఎంత వరకు సినిమా విజయవంతమవుతుందో వెండితెరపై చూడాల్సిందే.
