HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో రూ 62వేల కోట్ల ఒప్పందం

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో రూ 62వేల కోట్ల ఒప్పందం

HAL : వాయుసేనలో (IAF) కీలక సేవలందించిన మిగ్‌-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలకనున్న రక్షణ శాఖ… వీటి స్థానంలో తేజస్‌ జెట్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత రక్షణ మంత్రిత్వ శాఖ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)తో రూ.62,370 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (CSS) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నెలలోనే ఈ ఒప్పందం పూర్తయ్యింది. ఈ ఒప్పందం ద్వారా భారత వాయుసేన (IAF)కు 97 LCA తేజస్, Mk1A ఫైటర్ జెట్ విమానాలు (68 సింగిల్-సీటర్లు, 29 రెండు-సీటర్ ట్రైనర్లు) సమకూరనున్నాయి. స్వదేశీ టెక్నాలజీతో తయారైన తేజస్ Mk1A జెట్ విమానాలు అధునాతన UTTAM AESA రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌లతో రూపొందాయి.

HAL Updates

ఈ భారీ ప్రాజెక్ట్‌లో 105 భారతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఫలితంగా దేశంలో సంవత్సరానికి 11,750 ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ఊతమిచ్చే ఈ ఒప్పందం తాలూకూ డెలివరీలు 2027-28 నుంచి ఆరేళ్లలో పూర్తవుతాయి. ఈ చారిత్రక డీల్ భారత వాయుసేన శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, దేశీయ రక్షణ ఉత్పత్తిని, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

మిగ్‌-21 యుద్ధవిమానాల స్థానంలో ఈ సింగిల్‌ ఇంజిన్‌ ఎంకే-1ఏ తేజస్‌ జెట్‌లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా సమీకరిస్తున్న 97 విమానాల్లో.. 68 యుద్ధవిమానాలు, 29 ట్విన్‌ సీటర్స్‌ ఉండనున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈ అత్యాధునిక ఫైటర్‌ జెట్లలో ఉత్తమ్‌ AESA రాడార్‌, స్వయం రక్షా కవచ్‌ వ్యవస్థలతోపాటు కంట్రోల్‌ యాక్యుయేటర్‌లు ఉంటాయి. వీటిలో 64శాతానికి పైగా దేశీయ కంటెంట్‌, 67 దేశీయ ఉత్పత్తులు ఉండనున్నాయని రక్షణశాఖ పేర్కొంది.

2027-28 నుంచి వీటి సేకరణ ప్రారంభమవుతుందని, తద్వారా వాయుసేన సామర్థ్యాలు పెరగడంతోపాటు ఆత్మనిర్భర భారత్‌, భారత రక్షణ సంసిద్ధతలను మరింత పెంపొందిస్తుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు వచ్చే ఆరేళ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపాయి. అయితే, హెచ్‌ఏఎల్‌తో ఇది రెండో ఒప్పందం కాగా.. రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ యుద్ధవిమానాల సమీకరణకు రక్షణ శాఖ 2021 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

ఉత్తర్ ప్రదేశ్‌ను డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నాం – ప్రధాని మోదీ

ఉత్తర్ ప్రదేశ్‌లో భారత రక్షణరంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ AK-203 రైఫిల్స్ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈరోజు (గురువారం) ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (UPITS-2025) సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత సైన్యం స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్) లక్ష్యంతో విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

‘మన సైన్యం స్వయం సమృద్ధిని సాధించాలని, విదేశీ మూలాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆశిస్తోంది. ఈ లక్ష్యానికి, భారతదేశంలో బలమైన రక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి ఉత్పత్తి ‘మేడ్ ఇన్ ఇండియా’గా ఉండాలని నొక్కి చెబుతున్నాం. దీనికి మద్దతుగా, ఉత్తర్ ప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోంది. రష్యా సహాయంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో AK-203 రైఫిల్స్ తయారీ త్వరలో ప్రారంభం కానుంది’ అని పీఎం మోదీ చెప్పారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో డిఫెన్స్ కారిడార్ అభివృద్ధి చేస్తున్నామని.. ఇక్కడ బ్రహ్మోస్ మిస్సైళ్లు, ఇతర ఆయుధ వ్యవస్థల తయారీ ఇప్పటికే జరుగుతోందని మోదీ చెప్పారు. ఇందులో భాగంగానే UPITS-2025, ‘అల్టిమేట్ సోర్సింగ్ బిగిన్స్ హియర్’ అనే థీమ్‌తో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు ఈ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు.

ఇది ఆవిష్కరణ, సమైక్యత, అంతర్జాతీయీకరణపై దృష్టిపెడుతూ.. విదేశీ కొనుగోలుదారులు, దేశీయ B2B, B2C కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైవిధ్యమైన, ఆధునిక పరిశ్రమలు, MSMEలు, కొత్త ఆర్థికవ్యవస్థలను సృష్టించబోతున్నాయని మోదీ అన్నారు. ఈ అభివృద్ధి భారత రక్షణ రంగంలో స్వదేశీ తత్వాన్ని బలపరుస్తూ, ఉత్తర్ ప్రదేశ్‌ను డిఫెన్స్ హబ్‌గా మార్చనుందని ప్రధాని చెప్పారు. దేశ ఆర్థిక, రక్షణ లక్ష్యాలకు ఇది మరో మైలురాయిగా మోదీ అభివర్ణించారు.

Also Read : Wangchuk: సోనమ్ వాంగ్‌ చుక్‌ కు సీబీఐ ఉచ్చు

Leave A Reply

Your Email Id will not be published!