హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేశాడని, రాదని అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆచరణలో వచ్చేలా చేసిన మహా నాయకుడంటూ పేర్కొన్నారు.
సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడని, పాలన ఎలా ఉండాలో కూడా దేశం గర్వ పడేలా చేశాడన్నారు కేటీఆర్. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కలిగిన లెజండ్ లీడర్ అని ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.
అలాంటి నాయకుడికి అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం…అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ పై నోటీసులు ఇవ్వడం, అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అని అన్నారు.నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయ లేరని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు కేటీఆర్.
