21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్స‌వం

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమరావతి : ప్రతిష్టాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కోటి మందితో ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. యోగాంధ్ర-2026 కార్యక్రమం నిర్వహాణపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అలాగే ఇటీవల జరుగుతున్న పరిణామాల పైనా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని అన్నారు. జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్ గా ఉప‌యోగ ప‌డుతుంద‌ని చెప్పారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధన యోగా. యోగాను మన జీవన విధానంలో భాగం చేసేందుకు యోగాంధ్ర ద్వారా ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు.

ఈ ఏడాది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ ‘Yoga for Healthy Aging’. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగాను అనుసరించాలని చెప్పడమే థీమ్ ఉద్దేశం అన్నారు. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు. ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి నిత్య సాధనగా అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారాలి. ఈసారి యోగాంధ్ర 2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గతేడాది స్ఫూర్తిని కొనసాగించాలి. జూన్ 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తాం.

అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్టానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25 వేల మందితో యోగా ప్రదర్శన నిర్వహిస్తాం. ప్రతి జిల్లాకు ప్రత్యేక థీమ్‌ నిర్ణయించాం. ఎన్‌టీఆర్ జిల్లాలో పోలీసు సిబ్బంది, కోనసీమలో రైతులు వంటి ప్రత్యేక వర్గాలతో కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో 2 వేల నుంచి 3 వేల మంది పాల్గొనే కార్యక్రమాలు నిర్వహిస్తాం. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించి యోగా-టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. ఉండవల్లి గుహలు, శ్రీశైలం వంటి చారిత్రక ప్రాంతాలు వేదికలుగా ఈ యోగా కార్యక్రమం చేపడుతున్నాం అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Leave A Reply

Your Email Id will not be published!