అమరావతి : అమెరికా సర్కార్ తాజాగా ప్రకటించిన టారిఫ్ తగ్గింపుతో ఏపీలోని ఆక్వా రంగానికి మరింత ఆసరా కల్పించేందుకు దోహద పడుతుంది. ఈ సందర్బంగా స్పందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఈ పరిణామంతో సముద్ర ఆహార ప్రాసెసింగ్ రంగంలోని లాభ మార్జిన్లు కూడా మెరుగవుతాయని, అధిక టారిఫ్ కాలంలో 5–5.5 శాతానికి తగ్గిన ప్రాసెసర్ల మార్జిన్లు టారిఫ్ తగ్గింపు అనంతరం తిరిగి 7–8 శాతం స్థాయికి చేరే అవకాశం ఉందని చెప్పారు కేంద్ర మంత్రి. కేంద్ర బడ్జెట్ – 2026లో సముద్ర ఆహార ప్రాసెసింగ్‌కు అవసరమైన ఇన్‌పుట్స్‌పై కల్పించిన డ్యూటీ రాయితీలు ఈ రంగానికి అదనపు మద్దతును అందించనున్నాయని తెలిపారు.
అమెరికా మార్కెట్ పునరుద్ధరణతో పాటు యూరోపియన్ యూనియన్, చైనా, వియత్నాం, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ వంటి అమెరికేతర మార్కెట్లకు భారతీయ సముద్ర ఆహార ఎగుమతులు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని చెప్పారు అచ్చెన్నాయుడు, 2025–26 ప్రారంభంలో ష్రింప్ ఎగుమతుల్లో అమెరికేతర మార్కెట్ల వాటా సుమారు 57 శాతానికి చేరడం మార్కెట్ విభిన్నీకరణకు నిదర్శనమని అన్నారు. దేశంలో సముద్ర ఆహార ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ టారిఫ్ తగ్గింపు వరంగా మారుతుందని తెలిపారు.
ఎగుమతుల పునరుద్ధరణతో రాష్ట్రంలోని మత్స్య, ఆక్వా రంగాల్లో రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, స్థూల విలువ జోడింపు (GVA) కూడా మెరుగుపడతాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. MPEDA అంచనాల ప్రకారం 2025–26 లో దేశ వ్యాప్తంగా మొత్తం సముద్ర ఆహార ఎగుమతులు 14–15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరే అవకాశముందని పేర్కొన్నారు. మొత్తం మీద అమెరికా టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించడం భారతీయ సముద్ర ఆహార ఎగుమతుల పునరుద్ధరణకు మార్గం సుగమం అవుతుందన్నారు కింజారపు అచ్చెన్నాయుడు. అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగం స్థిరమైన అభివృద్ధికి కీలకంగా నిలుస్తుందని తెలిపారు.
