అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. తాజా బడ్జెట్ లో పశు పోషణకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. షెడ్యూల్డు కులాలు / షెడ్యూల్డు తెగలు, పేద పశుపోషకులకు 50,000 గోకులాలను నిర్మించాలని ప్రతిపాదించామన్నారు. నూరు శాతం రాయితీపై 2.65 లక్షల ఎకరాలలో బహువార్షిక పశుగ్రాసాల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లు పేర్కొన్నారు. వీధి పశువులకు రక్షణ కొరకు 10 లక్షల రూపాయల యూనిట్ ఖరీదుతో జిల్లాకు ఐదు చొప్పున ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో గోశాలలను నిర్మించాలని నిర్ణయించామన్నారు అచ్చెన్నాయుడు.
2026-27లో పశుసంవర్ధక శాఖకు 1121.26 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించామని తెలిపారు. చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 29 శాతం వాటాతో, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం (21,246 కోట్ల రూపాయలు) వాటాతో దేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. సుమారు 75 శాతం రొయ్యల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచి జరుగుతోందని చెప్పారు మంత్రి. 2025-26కు 66.62 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికిగాను జనవరి 2026 నాటికి 53.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు.. 2025-26 సంవత్సరానికి మత్స్యరంగంలో 19 శాతం వృద్ధి రేటు సాధించగలమని అంచనా వేశామన్నారు. ఆక్వా కల్చర్ రైతులకు విద్యుత్ సబ్సిడీగా 627 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. 2026-27 సంవత్సరానికి అవసరమైన సబ్సిడీ మొత్తం 1,145 కోట్ల రూపాయలు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 2705 కొత్త ఆక్వా కనెక్షన్లు ఇచ్చామన్నారు.
