హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సేవకు, అభివృద్ధి ప్రణాళికల అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించబోతోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యచరణకు సిద్ధమవుతోంది.. ఈ కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. యావత్ తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక కేర్, ప్యూర్, రేర్ కు అనుగుణంగా అన్నీ శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఎంత మాత్రం అద్దె భవనాలలో ఉండకూడదని అన్నారు. కేంద్ర ప్రయోజిత పథకాలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్ నిర్ధిష్ట సమయంలో జరగాలని అన్నారు.
వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, పెట్టుబడులు గ్రౌండ్ కావాలని పేర్కొన్నారు సీఎం. సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతను వినియోగించు కోవాలని దిశా నిర్దేశం చేశారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో రాబోయే మార్పులు, తద్వారా నగర ప్రజలకు జరిగే మేలుపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అన్నారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు సీఎం. వంద నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించ బోతున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత మెరుగు పడాలన్నారు. ప్రాంతాల వారిగా మెడికల్ డేటాను తయారు చేయాలని పేర్కొన్నారు. మార్చి 6 నుండి 99 రోజుల ప్రణాళిక అమలు కార్యచరణ తీసుకోవాలని అన్నారు. జూన్ 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. జూన్ 2 తెలంగాణ పండుగ ఘనంగా జరుపుకోవాలని చెప్పారు.
