అమరావతి : జగన్ అవినీతి, అసమర్థ నిర్ణయాల వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచి పోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇదే విషయమై ఆనాడే జగన్ ను రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నిలదీయాల్సి ఉండాల్సిందన్నారు. జగన్ తీరుతో రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు పట్టించు కోవడం మానేసి, ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. వైసీపీ నాయకుల చేష్టలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి సవిత తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం రాయలసీమకు తాగు, సాగునీరందించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. వైసీపీ నాయకుల పొలాలకు నీరు వస్తుందంటే అది కూడా సీఎం చంద్రబాబు చలవేనని మంత్రి సవిత స్పష్టంచేశారు.
రాయలసీమను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 2014-19 మధ్య రాయలసీమ తాగు, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12,441 కోట్లు వెచ్చించారని మంత్రి సవిత గుర్తు చేశారు. తరవాత వచ్చిన జగన్ అయిదేళ్లలో కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రాయలసీమ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రూ.3,870 కోట్లతో హంద్రీ-నీవా కాలువను అభివృద్ధి కుప్పం వరకూ సాగు నీరందించామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్, పారిశ్రామిక, పర్యాటక హబ్ గా అభివృద్ది చేస్తున్నామన్నారు. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధిక శాతం ఏపీకే తరలొస్తున్నాయన్నారు. ఇందుకు కారణం సీఎం చంద్రబాబు విజనేనని మంత్రి సవిత కొనియాడారు.
