హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

పిలుపునిచ్చిన సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నగరంలో హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయ‌న హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి ఆయన పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. బ్లూ కోట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలన్నారు.

ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో, పాదచారులు, వాహనాలపై రంగులు చల్లొద్దని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టించేందుకు నగర వ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు వీసీ స‌జ్జ‌నార్. ప్రజలు రసాయన రంగులకు బదులు సహజ సిద్ధమైనవి వాడాలన్నారు. వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని చెప్పారు. రోడ్లపై యువకులు గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామ‌నన్నారు.

ప్రస్తుతం రంజాన్ మాసం నేప‌థ్యంలో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల‌న్నారు. పీస్ కమిటీల సమన్వయంతో పోలీసులు పని చేయాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాల‌న్నారు. హోలీ సందర్భంగా హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆంక్ష‌లు విధించిన‌ట్లు తెలిపారు. హోలీ పండుగ సంద‌ర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ ప్ర‌కారం కేసులు నమోదు చెస్తామ‌ని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాల‌ని సూచించారు. పోలీసులకు సహకరించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని నగర ప్రజలను కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!