హైదరాబాద్ : జలమండలి లోని అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ-ఆఫీస్ ను అన్ని విభాగాలలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల కార్యాలయాల్లో సామర్థ్యం, పారదర్శకత, బాధ్యతతో పాటు సేవల ప్రమాణాలు మెరుగు పడనున్నాయని అయన అన్నారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి ఈ-ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి ఫైలు మాన్యువల్ గా స్వీకరించడం జరగదని ఈ-ఆఫీస్ ద్వారా పంపించాలని అధికారులతో అన్నారు.
ఈ-ఆఫీసులో స్కాన్ చేసి భద్రపరచడమే కాకుండా వివిధ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ ఆఫీసులో పొందుపరచడం జరుగుతుందని చెప్పారు ఎండీ అశోక్ రెడ్డి. సంబంధించిన అధికారి ఎవరైనా వారి విభాగపు ఫైల్స్ ఈ-ఆఫీసులో సరిచూసుకునే వెసులుబాటు ఉండడంతో పరిపాలన సులభతరం అవుతుందని అన్నారు. తొలుతగా ప్రధాన కార్యాలయంలో అన్ని కార్యకలాపాలను ఈ-ఆఫీస్ లో నిర్వహిస్తామని.. విడతల వారీగా అన్నీ డివిజన్ లలో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఎండీ వివరించారు.
ఈ ఆఫీస్ వల్ల కార్యనిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని, ఫైళ్ల ప్రాసెసింగ్ సమయం తగ్గుతుందని, రికార్డు నిర్వహణ మెరుగు పడుతుందన్నారు ఎండీ. భద్రమైన డిజిటల్ నిల్వతో పాటు ఆవరమైనప్పుడు సులభంగా తనిఖీ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. అంతే కాకుండా విభాగాల మధ్య సమన్వయం మెరుగు పడుతుందని పేర్కొన్నారు.
