హైదరాబాద్ : ఇచ్చిన హామీలను అమలు చేయలేక కొత్త దుకాణం మొదలు పెట్టారంటూ కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు లేదన్నారు. గత సీజన్ పంట బోనస్ ఇవ్వక చేతులెత్తేశారంటూ మండిపడ్డారు. చివరకు యూరియా కూడా సరఫరా చేయలేక రైతులను నడిరోడ్డు మీదకు ఈడ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి గొంతు కోసిన ఈ మోసాల గురించి రైతులకు వివరిస్తారా అని నిలదీశారు హరీశ్ రావు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేసారంటూ వాపోయారు. జాబ్ క్యాలెండర్ ను జాబ్ లెస్ క్యాలెండర్ చేసారంటూ ఫైర్ అయ్యారు.
నోటిఫికేషన్లు ఇవ్వకుండా మూసీ బ్యుటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు తన్నీరు హరీశ్ రావు. రాజీవ్ యువ వికాసం పేరిట తీసుకున్న దరఖాస్తులు దిక్కు లేకుండా పోయాయని అన్నారు. ఇప్పుడు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం అంటూ కొత్త పాట పాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను ఎలా మోసం చేసారో వివరిస్తారా రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. వారం వారం ఆరోగ్య రంగం, విద్యా రంగం, గ్రామీణాభివృద్ది అంటూ పేర్లు పెట్టి.. ఆసుపత్రుల్లో కనీసం మందుల్లేవని, బడుల్లో కనీస వసతులు కరువయ్యాయని, గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని ఒప్పుకున్నారని అన్నారు.
ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ అనేది ప్రభుత్వ కనీస బాధ్యత కానీ, దానికి కూడా ఒక ఈవెంట్ లాగా కలర్ ఇవ్వడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు హరీశ్ రావు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన కొద్ది మందిని చూపిస్తామని గొప్పలు చెబుతున్న మంత్రులు.. అందని గ్యారెంటీల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది బాధితుల సంగతేంటో చెప్పాలని డిమాండ్ చేశారు ..సోలార్ విద్యుత్, పర్యావరణం, డ్రగ్స్ అడ్డుకట్ట లాంటివన్నీ పత్రికల్లో పబ్లిసిటీ ఇచ్చుకునేందుకు పెట్టుకున్న పేర్లు తప్ప, ఇందులో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.
