హైదరాబాద్ : హైడ్రా ప్రజావాణికి 32 ఫిర్యాదులందాయి. స్మశానం వైపు చూడాలంటేనే వెనుకడుగు వేస్తాం.. అలాంటిది వాటిని కబ్జా చేసి ఇళ్లు నిర్మించేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువులు, నాలాలు కబ్జా కాకుండా కాపాడాలని ఫిర్యాదులందాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులను చూస్తే ముచ్చటేస్తోందని.. మా ప్రాంతంలోని చెరువులను కూడా అభివృద్ధి చేయాలని పలువురు ప్రజావాణిలో దరఖాస్తులు అందజేశారు. ముందుగా మురు గునీటిని బయటకు పంపి గుర్రపుడెక్కను వదిలించాలని కోరారు. గొలుసుకట్టు చెరువుల మాదిరి అభివృద్ధి చేసి.. వరద ముప్పు లేని నగరంగా తీర్చిదిద్దాలని కాలనీవాసులు, సంక్షేం సంఘం ప్రతినిధులు హైడ్రాకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ ఫిర్యాదులను హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి, సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు.
యూసుఫ్‌గూడ, మధురానగర్ ప్రాంతాల్లో ఉన్న కృష్ణాకాంత్ పార్కులో చెరువును అభివృద్ధి చేయాలని వాకర్స్ అసోసియేషన్ హైడ్రాను కోరారు. గతంలో ఉన్న చెరువును చాలా వరకూ పూడ్చేసి పార్కును చేశారని.. ఇప్పుడున్న చెరువును కొంతమేర విస్తరిస్తే చాలా వరకు వరద కట్టడి చేయవచ్చునని పేర్కొన్నారు. పార్కులో ఇప్పుడున్న చెరువు నిర్వహణ కరువై దుర్గంధ భరితంగా మారిందని వాపోయారు కాలనీ వాసులు. ఈ చెరువులో స్వచ్ఛమైన నీరు చేరితే భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. ఈ వేసవి కాలంలోనే చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
ఇక శేరిలింగంపల్లి పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్-1 కాలనీలో పార్క్ నం.4 భూమిని కొందరు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. కాలనీకి ఆనుకుని ఉన్న భూమి యజమానులమని చెప్పుకుంటూ 20 ఏళ్ల క్రితం నిర్మించిన బౌండరీని ధ్వంసం చేసి పార్క్ భూమిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆక్రమణదారులు పార్క్ కంపౌండ్ వాల్లో కొంత భాగాన్ని కూల్చివేయడంతో ప్రస్తుతం పార్క్ భూమి రక్షణ లేకుండా ఉందని పేర్కొన్నారు. వెంటనే పార్క్ ని కాపాడాలని కోరారు.