న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్ద వాతావరణం నేపథ్యంలో పశ్చిమాశియా నుంచి ఏకంగా 2.60 లక్షల మంది తిరిగి ఇండియాకు వచ్చారని తెలిపింది. యూఏఈలోని వివిధ విమానాశ్రయాల నుంచి భారతదేశంలోని వివిధ గమ్యస్థానాలకు సుమారు 70 విమానాలు నడిచే అవకాశం ఉంది. ఇరాన్-అర్మేనియా , ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల గుండా సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి భారత రాయబార కార్యాలయం ఒక సలహా జారీ చేసింది . అందరూ వాటిని పాటించాలని కోరింది విదేశీ మంత్రిత్వ శాఖ. తీవ్రమవుతున్న పశ్చిమ ఆసియా సంఘర్షణల మధ్య ఫిబ్రవరి 28 నుంచి ఆ ప్రాంతం నుంచి భారీ ఎత్తున ప్రయాణీకులు తరలి వచ్చారంటూ పేర్కొంది.
పశ్చిమ ఆసియా పరిస్థితిపై ఇక్కడ జరిగిన అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అదనపు కార్యదర్శి (గల్ఫ్) అసీమ్ ఆర్ మహాజన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. యూఏఈలోని వివిధ విమానాశ్రయాల నుంచి భారతదేశంలోని వివిధ గమ్యస్థానాలకు పలు విమానాలు నడిచే అవకాశం ఉందని తెలిపారు. విమాన పరిస్థితి “భరోసా ఇచ్చేలా” ఉందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. ఇద్దరు నాయకులు పశ్చిమ ఆసియాలోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అమాయకుల ప్రాణనష్టం, పౌర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించిన యూఏఈపై జరిగిన అన్ని దాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
