హైదరాబాద్ : ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత, ఎనలిస్ట్ హర్షా భోగ్లే ఐపీఎల్ 2026 మెగా టోర్నీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 10 జట్లు ఐపీఎల్ కప్ కోసం తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ టోర్నీ అధికారికంగా మార్చి 28న శనివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడనుంది. ఈ సందర్బంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు హర్ష భోగ్లే. ఆయన వరుసగా ఆయా జట్ల బలాలు, బలహీనతల గురించి చెబుతూ వస్తున్నారు. ఈసారి హాట్ ఫెవరేట్ గా ఆయా జట్లను కొందరు ఎనలిస్టులు, మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నప్పటికీ హర్షా భోగ్లే మాత్రం కీలక వ్యాఖ్యలు చేశాడు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి.
గత ఐపీఎల్ సీజన్ లో ఆశించిన మేర రాణించ లేక పోయింది. ఈ సారి ఊహించని రీతిలో ఇద్దరు కీలకమైన ఆటగాళ్లను ఒకే ఒక్క ఆటగాడి కోసం వదులుకుంది సీఎస్కే టీం మేనేజ్మెంట్. జట్టులోకి ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరోగా నిలిచిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ రాకతో మరింత బలం పెరిగిందన్నాడు. తను ఇదే ఫామ్ గనుక కొనసాగిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇక తిరుగే ఉండదన్నాడు హర్షా భోగ్లే. ఇక కీలకమైన ఓపెనింగ్ విషయానికి వస్తే అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టుకు స్కిప్పర్ గా ఉన్న ఆయుష్ మాత్రే కాకుండా సంజు శాంసన్ తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ రానున్నాడని, ఇక బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమేనని అన్నాడు.
