హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ఎన్నడూ లేనంతగా ఆదిత్య ధర్ తీసిన దురంధర్ -2 మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. తను సామాన్యంగా ఏ వ్యక్తులను, సినిమాలను ప్రశంసించరు. కానీ గత కొంత కాలంగా దురంధర్ -1, దురంధర్ సీక్వెల్ మూవీ గురించి పదే పదే పేర్కొంటూ దానిని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. చిత్ర పరిశ్రమ కింద ఒక అణుబాంబును పేల్చిన తర్వాత, మిగతా చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న నిశ్శబ్దం దిగ్భ్రాంతి కలిగిస్తోందని పేర్కొన్నారు.
ప్రధానంగా దురంధర్ -2 మూవీ సృష్టించిన ఈ విధ్వంసకరమైన విస్ఫోటనం చిత్ర పరిశ్రమలోని మిగతా వారందరినీ అంతరిక్షంలోకి విసిరేసిందని అన్నారు ఆర్జీవీ. ఆ సుదూర ప్రాంతాల వల్ల వారి చప్పట్లు ఇక్కడికి చేరలేవని ఇలా జరుగుతోందా, లేక వాళ్ళు వాస్తవాన్ని అంగీకరించకుండా, “ఇది కేవలం ప్రచారం… త్వరలోనే ఇది పోతుంది,” అని ఒకరికొకరు గుసగుసలాడుకుంటూ, వెనక్కి పాకుతూ వెళ్లి తమ పాత, రొటీన్ సినిమాలనే మళ్ళీ తీయడం మొదలుపె ట్టాలనుకుంటున్నారా, నాకేమీ తెలియడం లేదని పేర్కొన్నారు ఆర్టీవి.
లేక, ఆ సినిమా అద్భుతమైన ప్రతిభకు నిశ్చేష్టులైపోయి, తాము ఇప్పటి వరకు తీస్తున్నా లేదా తీయాలని అనుకుంటున్నా, ఏ సినిమా కూడా ఇప్పుడు దీనికి సాటి రాదని గ్రహించారా అని ప్రశ్నించారు. కానీ, కళ్లెదుటే నిలబడి, బాక్సాఫీస్ వద్ద నేలనే కంపింప జేస్తున్న, గర్జనతో కళ్లలో నిప్పులు కక్కుతున్న ధురందర్2 లాంటి డైనోసార్‌ను పట్టించు కోక పోవడం అత్యంత అవివేకం కాదా? అని నిలదీశారు. సినీ పరిశ్రమలోని నా సహోద్యోగులందరికీ నా మనస్ఫూర్తి సలహా ఏంటంటే, దయచేసి ధురందర్2ను అత్యంత తీవ్రంగా తీసుకోండి. సినిమా నిర్మాణంలో ఒక సరికొత్త కోర్సులా దీన్ని అధ్యయనం చేసి, మిమ్మల్ని మీరు విద్యావంతులుగా చేసుకోండి అని సూచించారు రామ్ గోపాల్ వర్మ.
