చెన్నై : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందని ఆరోపించారు. ఇదే సమయంలో ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని ప్రకటించారు. ఆయన పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు డీజీపీని. ఆయన వచ్చీ రావడంతోనే శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఉచిత విద్యుత్, మహిళల భద్రతా చర్యలను ప్రకటించారు విజయ్. చెన్నైలోని సచివాలయంలో పత్రాలపై సంతకం చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది.
రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రభంజనం వీస్తున్న తరుణంలో ఆయన పార్టీకి చెందిన తొమ్మిది మంది సహచరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి రెండు నెలలకు 500 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి కొత్త ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను ప్రకటించారు. మహిళల భద్రత, మాదక ద్రవ్యాల బెడద వంటి సమస్యలను నిరంతరం సమీక్షిస్తామని చెప్పారు సీఎం విజయ్. సచివాలయంలోని తన గదిలో కూర్చుని ఆయన ప్రొటెం స్పీకర్ ఎన్నికకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఎన్నికైన సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు తమ ఎన్నికల ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి తమ వెంట ఉంచుకోవాలని అసెంబ్లీ కార్యదర్శి సూచించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మంగళవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది.