భక్తులకు అభయ ప్రదానం చేసిన గోవిందుడు

హనుమంత వాహనంపై శ్రీ గోవింద రాజస్వామి దివ్య విహారం

తిరుప‌తి : తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో బాగంగా రోజైన గురువారం 7 గంటలకు శ్రీ గోవింద రాజస్వామి వారు హనుమంత వాహనంపై దివ్య మంగళ స్వరూపంతో భక్తులకు దర్శనమిచ్చి అభయప్రదానం చేశారు.భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి గోవింద నామ స్మరణతో స్వామి వారిని దర్శించుకుని పరవశించారు.

త్రేతాయుగంలో శ్రీరాముడికి పరమ భక్తుడిగా వెలుగొందిన హనుమంతుడు భక్తి, శక్తి, శరణాగతికి ప్రతీకగా నిలిచాడు. బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం, నిర్భయత్వం, వాక్పటిమ హనుమత్స్మరణతో సిద్ధిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే స్వామి వారు హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులకు శరణాగతి మహిమను చాటిచెప్పారు. అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, విజివో గిరిధర్, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎవ్వో శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!