తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరవ రోజు రాత్రి శ్రీ గోవిందరాజ స్వామివారు గజ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు సాగుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామి వారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి గోవింద నామ స్మరణతో స్వామి వారిని సేవించుకున్నారు.
గజవాహనం ఐశ్వర్యానికి, మంగళానికి ప్రతీకగా భావించ బడుతుంది. ఏనుగు ఓంకార స్వరూపానికి, విశ్వ తత్త్వానికి సంకేతమని పురాణాలు వివరిస్తాయి. స్వామి వారు గజరాజుపై విహరించడం ద్వారా అహంకారాన్ని విడిచి భగవంతుని శరణు చేరితే కర్మవిముక్తి కలుగుతుందనే సందేశాన్ని భక్తులకు అందించారు. ఏడవ రోజు శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారు దర్శన భాగ్యం కల్పించారు భక్త బాంధవులకు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎవ్వో శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని జేఈఓ వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవాలకు హాజరయ్యారు.