సీఎం రేవంత్ తో ద‌క్షిణాఫ్రికా ఉప రాష్ట్ర‌ప‌తి భేటీ

మౌలిక స‌దుపాయలు, పెట్టుబ‌డుల‌పై విస్తృత చ‌ర్చ

హైద‌రాబాద్ : రాష్ట్రంలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, పెట్టుబ‌డుల‌కు ఆస్కారంగా ఉంద‌ని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ ఇన్‌స్టిట్యూట్‌లో, దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి మ‌షటైల్ తో పాటు ప్రతినిధి బృందంతో కీల‌క స‌మావేశం జ‌రిగింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న దక్షిణాఫ్రికా వ్యాపారాలకు అవసరమైన అన్ని రకాల మద్దతును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. తెలంగాణ , దక్షిణాఫ్రికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం , వాణిజ్య, పెట్టుబడి సహకారాన్ని విస్తరించడంపై చర్చలు కేంద్రీకరించ బడ్డాయి. తెలంగాణకు సంబంధించి పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పటిష్టమైన పారిశ్రామిక వ్యవస్థ, కీలక రంగాలలో అందుబాటులో ఉన్న విస్తృత శ్రేణి అవకాశాలను ముఖ్యమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి మషటిలే, తమ ప్రతినిధి బృందానికి తెలంగాణ ప్రభుత్వం అందించిన ఘన స్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు . రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేశారు.

తెలంగాణ సాధించిన అద్భుతమైన అభివృద్ధి పథం, అక్కడి ప్రజల సంకల్పం, ఆవిష్కరణ, పారిశ్రామిక స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. భారతదేశంలోని అత్యంత పిన్న వయస్సు గల రాష్ట్రాలలో ఒకటిగా, దేశ జీడీపీకి గణనీయమైన వాటాదారుగా ఎదగడం ఎంతో ప్రశంసనీయం అని మషటిలే ప్ర‌శంసించారు.సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణ, పెట్టుబడుల రంగాలలో తెలంగాణతో సహకారాన్ని మరింతగా పెంపొందించు కోవడానికి దక్షిణాఫ్రికా ఆసక్తిగా ఉందని తెలిపారు. అలాగే, బలమైన వ్యాపార , సంస్థాగత భాగస్వామ్యాలను సులభతరం చేయడానికి న్యూఢిల్లీలోని దక్షిణాఫ్రికా హైకమిషన్ చురుకుగా కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ, సమాచార సాంకేతికత, జీవ శాస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్లు, ఏరోస్పేస్, రక్షణ, పరిశోధన, విద్య, ఆరోగ్య సంరక్షణ, తయారీ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, మౌలిక సదుపాయాల రంగాలలో తెలంగాణకున్న బలాలను మంత్రి శ్రీధర్ బాబు నొక్కి చెప్పారు. హరిత ఇంధనం, సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ ఎదుగుతున్న నాయకత్వాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఉన్న బలమైన ఆర్థిక సంబంధాన్ని ప్రస్తావిస్తూ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15.57 బిలియన్ డాలర్లకు చేరుకుందని, తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను అన్వేషించాల్సిందిగా దక్షిణాఫ్రికా కంపెనీలను ఆయన ఆహ్వానించారు.

Leave A Reply

Your Email Id will not be published!