#Nethaji : నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి
Nethaji : భారత మాత ముద్దు బిడ్డ జాతీయ నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి జనవరి 23న పరాక్రమ దివస్ గా ప్రకటించింది . ఈ సమయంలో ఆ మహనీయుడు భారతావనికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ...
Nethaji : భారత మాత ముద్దు బిడ్డ జాతీయ నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి జనవరి 23న పరాక్రమ దివస్ గా ప్రకటించింది . ఈ సమయంలో ఆ మహనీయుడు భారతావనికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ…
అది 1924 వ సంవత్సరం. బ్రిటిష్ ఇండియాలో ఉన్న కలకత్తా మహానగరానికి మేయర్ గా ప్రముఖ జాతీయ నాయకుడు స్వాతంత్ర పోరాట సమరయోధుడు చిత్తరంజన్ దాస్ ఎన్నికయ్యారు. బ్రిటిష్ హయాంలో కూడా స్థానిక ప్రభుత్వాలకు చాలా విలువ ఇచ్చే వారు. అందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరిని నియమించాలనే విషయంలో అప్పటి మేయర్ కు చాలా అధికారాలు ఉండేవి. నియమించేది ప్రభుత్వమే అయినా ఎవరిని నియమించాలనే సిఫార్సు చేసే అధికారం ఎన్నికైన మేయర్ కు ఉండేది.ఆ అధికారం ప్రకారం చిత్తరంజన్ దాస్ సివిల్ సర్వీసెస్ పాసైన కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగిన చాకులాంటి నవ యువకుడిని ఎంపిక చేసుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. మేయర్ గారి ఇష్టప్రకారమే బ్రిటిష్ ప్రభుత్వం ఆ యువకుడిని కలకత్తా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించింది. ఆ యువకుడు జాతీయ భావాలు కలిగిన చాలా నిక్కచ్చి మనిషి. స్వాతంత్ర సమర పిపాసి. అందుకే ఉద్యోగం లో ఉండి కూడా ఆనాటి స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు .బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది కంటగింపుగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను ఆ యువకుడిని కలకత్తా జైల్లో పెట్టింది.
ఇక అప్పుడు కలకత్తా సీఈవోగా కొత్తవారిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ కలకత్తా మేయర్ గా పని చేస్తున్న దృఢచిత్తం గల చిత్తరంజన్ దాస్ మళ్లీ ఆ యువకుడినే కలకత్తా సీఈఓగా కొనసాగించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. సీఈవో రాజ్యాంగం ప్రకారం మున్సిపాలిటీ నిర్వర్తించాల్సిన పనుల్లో ఒకటి కూడా తప్పు చేయలేదని, జాతీయోద్యమం అనేది ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని ఆయన ఆ లేఖలో వివరించారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కానీ ఇతరత్రా సర్వీస్ రూల్స్ గాని ఎలాంటి విఘాతం కలిగించ లేదని ఆయన ఆ యువకుడిని సమర్థించారు. అందుకే కలకత్తా జైల్లో మగ్గుతున్న ఆ యువకుడిని తన సీఈవోగా కొనసాగించాలని చిత్తరంజన్ దాస్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. దానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించి ఆ యువకుడిని జైల్లో ఉంచి సీఈఓ గా కొన సాగించింది. ఆ యువకుడు కలకత్తా జైల్లో ఉన్నన్ని రోజులు మున్సిపల్ ఆఫీసు నుండి ప్రతిరోజు ఆయన సంతకాల కోసం ఫైళ్లు కింది సిబ్బంది జైలుకే తీసుకెళ్ళేవారు. జైల్లోనే వాటిని క్షుణ్ణంగా చదివి అవసరమైన ఫైళ్ల మీద అప్పటికప్పుడు ఆ యువకుడు ఆదేశాలు ఇచ్చేవాడు. అలా ఒక ఆరు, ఏడు నెలల కాలం జైల్లో ఉండే ఆ సీఈఓ తన పాలనా బాధ్యతలను నిర్వహించారు.
కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది నచ్చలేదు. దాంతో ఆ యువకుడిని అండమాన్ దీవుల లోని పోర్ట్ బ్లెయిర్ లో ఉన్న మరొక జైలుకు తరలించారు. దాంతో కలకత్తా నగరం లోని జైల్లో ఉన్నప్పుడు ఈ ఫైళ్లను పంపడం సాధ్య పడిన విధంగా ఇకముందు వందల వేల మైళ్ళ దూరం ఫైళ్ళను పంపడం సాధ్యపడకుండా బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్నింది .దాంతో ఆ యువకుడు సీఈఓ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ యువకుడే ఆతర్వాత 1930లో కలకత్తా నగరం మేయర్ గా ప్రజలచే ఎన్నికై పరిపాలన సాగించారు. ఆ యువకుడు మరెవరో కాదు ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ విషయం చాలా మందికి తెలియదు .ఈనాటి స్థానిక ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఆనాటి స్థానిక ప్రభుత్వాలకు బ్రిటిష్ ప్రభుత్వంలో, పరాయి పాలనలో కూడా అంత స్వేచ్ఛ ఇచ్చారన్నది మనకు అర్థమవుతుంది. స్వతంత్ర భారతదేశంలో ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్ ని కానీ ఎన్నికైన ప్రజా ప్రతినిధి కోరుకుంటే వారిని నియమించే సాంప్రదాయం ఈరోజు మన ఊహకు కూడా అందదు. అంత గొప్ప మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్(Nethaji )జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం.
ఆనాటి స్థానిక ప్రభుత్వాల స్ఫూర్తిని అర్థం చేసుకోవాలంటే కేవలం చిత్తరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వారిద్దరే కాదు భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు కొని లాల్ బహదూర్ శాస్త్రి అలహాబాద్ నగర మేయర్ గా ,సర్దార్ వల్లభాయ్ పటేల్ అమ్మదా బాద్ నగర మేయర్ గా రాజగోపాలచారి (రాజాజీ) అప్పటి మద్రాసు నగర మేయర్ గా వీళ్ళు అందరూ స్థానిక ప్రభుత్వాలలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు గా పనిచేసిన వారే. అంతదాకా ఎందుకు భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల పితామహుడు మన తెలుగు వాడు పాములపర్తి వెంకట నరసింహారావు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు తదితరులు చాలామంది స్థానిక ప్రభుత్వాల వచ్చినవారే. ఇందులో చాలామంది జాతీయ స్థాయికి ఎదిగారు.స్థానిక ప్రభుత్వాల నుంచి జాతీయ స్థాయికి ఎదిగారు కనుకనే “జమీన్ నుండి ఆస్మాన్” వరకు భూమి నుంచి ఆకాశం వరకు వారికి క్షేత్రస్థాయి సంగతులు తెలిసేవి. దాంతో పాలన సజావుగా సాగేది.
భారతదేశ స్వాతంత్ర సంగ్రామం మూడు పాయలుగా సాగింది. మొదటిది గాంధీజీ ఆధ్వర్యంలోని సత్యం అహింస లు ఆయుధాలు గా బ్రిటిష్ వారి పై పోరాటం సాగింది.ఇక రెండవది సుభాష్ చంద్రబోస్(Nethaji )తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆనాడు గాంధీ మాటకు ఎదురు లేని కాలంలో ఆయనకు ఇష్టం లేకుండా ఆయన కాంగ్రెసు పార్టీలో ఎదిగారు. కానీ కేవలం గాంధీ మార్గం ద్వారా మనకు స్వాతంత్రం లభించదని ఆయన తలపోశారు. అందుకే నేషనల్ ఇండియన్ ఆర్మీ స్థాపించి దానికి ఆయనే నాయకత్వం వహించారు. జర్మనీ లాంటి ఇతర దేశాల మద్దతు తో తో బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేయాలని ఆయన అనుకున్నారు. ఆయన విమాన ప్రమాదంలో అదృశ్యం అయ్యేదాకా ఆయన నమ్మిన సిద్ధాంతాలతో భారత దేశానికి స్వాతంత్రం సాధించడానికి కృషి చేశారు .ఇక మూడవది భగత్ సింగ్ మార్గం మార్క్సిజం ఆలోచనా ధోరణితో సమ సమాజ నిర్మాణం కావాలని నూతన భారతదేశం ఆవిష్కరించడంలో స్వాతంత్ర పోరాటాన్ని జత కలిపారు .భగత్ సింగ్ విప్లవ మార్గాన్ని భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలని కోరుకున్నారు. వీరి ముగ్గురు మార్గాలు వేరు వేరు అయినా లక్ష్యం మాత్రం ఒకటే .అదే భారత దేశానికి స్వాతంత్రాన్ని సాధించడం. ఆ లక్ష్య సాధన లో అసువులు బాసి నేటికీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకొని భారత ప్రభుత్వం పరాక్రమ దివస్ గా ప్రకటించడం ముదావహం.
మహనీయుల జయంతి, వర్ధంతులను కేవలం మొక్కుబడిగా మాత్రమే జరపడం వారికి సరైన నివాళి కాదు. వారి ఆశయాలను(Nethaji )మనం సార్థకం చేసినప్పుడు మాత్రమే వారికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుంది. అందుకే భారత స్వాతంత్ర సంగ్రామంలో వివిధ దశలను మన యువతకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు పరాయి పాలన మీద పోరాటం సాగిస్తే ఈనాడు మన దేశంలోని రాజకీయ వ్యవస్థ పైన మన యువత పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజకీయాలు ఒక పవిత్రమైన వ్యాసం గా ఉండాల్సింది పోయి అక్రమార్జనకు మార్గంగా కొంతమందికి భోజ్యం గా మారాయి. అందుకే ఆ నాటి పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మన స్ఫూర్తి దాతల ను గుర్తుంచుకొని ఈరోజు కూడా దేశంలో జరుగుతున్న అన్యాయాలపై అక్రమాలపై మనం పోరాడాలి . అప్పుడే అలాంటి మహనీయులకు మనం సరైన నిజమైన నివాళి అర్పించి నట్లు అవుతుంది.

No comment allowed please