అమరావతి : రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు మంత్రి సవిత. వన్ డిస్ట్రిక్ – వన్ ప్రొడెక్ట్ కింద పలు చేనేత వస్త్రాల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. 2024 సంవత్సరానికి గాను పది ఓడీ-ఓపీ అవార్డులను ఏపీ సొంతం చేసుకుందని తెలిపారు. వాటిలో ఏడు అవార్డులు చేనేత, జౌళి శాఖకు చెందినవే కావడం విశేషం. ఆప్కోలో చేపట్టిన డిజిటైలేజేషన్ కు గానూ స్కోచ్ అవార్డు సొంతమైంది. గడచిన రెండేళ్ల కాలంలో చేనేత రంగానికి ఊపిరి పోసేలా కూటమి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
సగం ధరకే చీర, దోవతి నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ చేనేత రంగానికి ఊపిరిపోస్తే, నేడు సీఎం చంద్రబాబు నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేసేలా పథకాలు రూపొందిస్తున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేలా కూటమి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని మంత్రి వివరించారు. గత నెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో నేతన్న కుటుంబాలకు మరింత లబ్ధి కలుగుతోందని అన్నారు. చేనేతలకు 365 రోజుల పాటు పని కల్పించడమే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి సవిత చెప్పారు.