ఏపీ రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ షర్మిల
కూటమి ప్రభుత్వం నిర్వాకంపై సీరియస్ కామెంట్స్
అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ పై స్పందించారు. కొత్త సీసాలో పాత సారా సామెతను తలపించిందని అన్నారు. అంతా ఊహా జనితంగా, అభూత కల్పనలతో ఉందంటూ మండిపడ్డారు. అంకెలు ఘనం.. అప్పుల కుప్ప. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బారెడుంటే, బడ్జెట్ లో కేటాయింపులు మూరెడంత లేవన్నారు. ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించి, సూపర్ సిక్స్ హామీలకు పంగనామాలు పెట్టారంటూ ధ్వజమెత్తారు షర్మిలా రెడ్డి.. ఇతర ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టారని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని మరోసారి నిరూపితం చేసుకున్నారంటూ ఎద్దేవా చేవారు.
బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదన్నారు. కూటమి గెలిచి రెండేళ్లు అవుతున్నా మహాశక్తి పథకం అసలుందో లేదో తెలియదన్నారు షర్మిలా రెడ్డి. నెలకు రూ . 15 వందలు ఇస్తామని నమ్మించి కోటిన్నర మంది మహిళలను రెండేళ్లుగా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి సున్నావడ్డి పథకానికి ఒక్క రూపాయి కేటాయించ లేదన్నారు. నిరుద్యోగులకు మళ్లీ టోకరా పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి హామీపై ఊసే లేదన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మళ్లీ మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డ. జనవరి నెలలో ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ గురించి కూడా చెప్పనే లేదన్నారు. ఫీజు రీయింబర్స్ పథకానికి చిల్లిగవ్వ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ హామీకి దిక్కు లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సైతం వంచించారని ఆరోపించారు.
