అమరావతి : రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ , సమాచార శాఖా మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. చీరాల మండలం, అక్కయిపాలెం గ్రామపంచాయతీ, రామాపురం, పాండురంగా బీచ్ నందు జిల్లా కలెక్టర్, చీరాల ఎమ్మెల్యే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమామహేశ్వరరావు, బాపట్ల పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ శలగల రాజశేఖర్ తో కలసి జెట్ స్కీ రైడర్స్, విహంగ్ అడ్వెంచర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను అభివృద్ధి చేసే అధికారులకు స్థానికులు సహకరించాలని కోరారు. అధికారులు స్థానికుల ఆచారాలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. టూరిజంలో లక్షల పెట్టుబడి, ఉపాధి అవకాశం ఉందన్నారు. టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. టూరిజం అభివృద్ధికి అన్నీ పరిమితులను వెంటనే ఆమోదిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గతంలో వ్యాపారం చేసే సౌలభ్యం ఉండేదని, ఇప్పుడు వ్యాపారం వేగవంతం చేసే పరిస్థితులు ఉన్నాయని మంత్రి తెలిపారు. కొన్ని దేశాలు కేవలం టూరిజం పై వచ్చే ఆదాయంతో మునుగడ జరుగుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా టూరిజంను అభివృద్ధి పరచాలన్నారు. సముద్ర తీర ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ప్రపంచమంతా తెలుసునని ఆయన చెప్పారు. అటువంటి వాటికి తావు లేకుండా స్థానికులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రక్షణ విషయంలో టూరిస్టులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికులు టూరిస్టులను మోసగించకుండా, వారికి అనుకూలంగా, స్నేహ పూర్వకంగా వారితో మెలిగినప్పుడు టూరిస్టులు ఎక్కువ మంది వచ్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో రిసార్ట్లు ఎక్కువ అవటం, వ్యాపారం పెరగటం, ఆదాయం పెరగటం, ఉపాధి అవకాశాలు పెరగటం జరుగుతుందన్నారు.
