ముంబై : సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అశ్విని బిడే సంచలనంగా మారారు. మహారాష్ట్ర చరిత్రలో బొంబై మున్సిపల్ కార్పొరేషన్ కు తొలిసారిగా మహిళా కమిషనర్ గా నియమితులు కావడం విశేషం. రాష్ట్ర సర్కార్ ఆమె పనితీరు ఆధారంగా ఏరికోరి తనకు బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉండగా దేశంలోనే అత్యంత సంపన్నమైన, అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌కు మున్సిపల్ కమిషనర్‌గా కొలువు తీరిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐఏఎస్ అధికారిణిగా నిక్కచ్చిగా వ్యవహరిస్తారన్న పేరుంది. ఎవరికీ తల వంచరని, పని చేసుకుంటూ పోతారని ప్రచారం ఉంది. ఆమె పలు కీలకమైన పదవులు నిర్వహించారు. ఇప్పటి వరకు సీఎం ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. తను 1995 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారిణి.
అశ్విని భిడే 2015 నుండి 2020 వరకు ముఖ్య పాత్ర పోషించారు పాలనా పరంగా. తనదైన ముద్ర వేశారు.
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశారు. కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భిడే పరిపాలనా వృత్తిలో మౌలిక సదుపాయాల రంగంలో ఆమె చేసిన పరివర్తనాత్మక కృషి అత్యంత ప్రముఖంగా నిలుస్తుంది. నగరంలో మొట్టమొదటి పూర్తి భూగర్భ మెట్రో కారిడార్ అయిన ముంబై మెట్రో లైన్ 3 (కొలాబా-బాంద్రా-SEEPZ) అమలుకు ఆమె సారథ్యం వహించారు. ఆధునిక, సుస్థిర పట్టణ రవాణాకు ప్రతీకగా నిలిచిన ఈ ప్రాజెక్ట్, దీర్ఘకాలిక నగర ప్రణాళిక .పర్యావరణ స్పృహతో కూడిన అభివృద్ధి పట్ల ఆమెకున్న ప్రగాఢ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అదనపు మున్సిపల్ కమిషనర్‌గా , పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు అశ్విని బిడే. పలు కీలకమైన పదవులు ఆమె ఉన్నత స్థాయికి చేరడానికి దోహదపడ్డాయి. ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ తో పాటు ఎంబీఏ వంటి విద్యా అర్హతలు కలిగి ఉన్నారు. పట్టణ పరివర్తనకు ఆమె చేసిన అద్భుతమైన కృషిని గుర్తించి, ఫార్చ్యూన్ ఇండియా ఆమెను 2025 సంవత్సరపు అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చింది. 2024లో అశ్విని భిడేను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. తాజాగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు.
