పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం తీర‌ని అన్యాయం

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ : ఏపీకి కేంద్ర బ‌డ్జెట్ వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ 2026-27 పై స్పందించారు. అమ‌రావ‌తి రాజ‌ధానికి అప్పులు త‌ప్ప ఆదుకునేందుకు ఒక్క ప్ర‌క‌ట‌న కూడా చేయ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఎన్డీయేలో కీల‌క పాత్ర పోషిస్తున్న ఏపీ స‌ర్కార్ కు ఎందుకు స‌హాయం చేయ‌లేదో చెప్పాల్సిన అవ‌స‌రం లేదా అని ప్ర‌శ్నించారు. సోయి లేకుండా మౌనంగా ఉంటే ఎలా అని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు.

గ‌త బ‌డ్జెట్ లో ప‌ట్టించు కోని పోలవరం ప్రాజెక్ట్ కి మళ్ళీ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు ష‌ర్మిలా రెడ్డి. ఎత్తు 45.72 మీటర్లకు పెంచాలని కోరినా బడ్జెట్ లో మళ్ళీ పెడచెవిన పెట్టారని మండిప‌డ్డారు. కేవలం 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి ఇక ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్లకే అని చెప్పకనే చెప్పారు. గత బడ్జెట్ లో ప్రాజెక్ట్ పూర్తికి ఇస్తామని చెప్పిన 12 వేల కోట్లలో ఇచ్చింది 5 వేల కోట్లే. ఈ ఏడాది 3 వేల కోట్లు మాత్రమే ఇస్తే 2027 నాటికి ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుంది అని ప్ర‌శ్నించారు. మిగిలిన నిధుల సంగతి ఏంటి ? 20 వేల కోట్ల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మిగులు కోసం పోలవరానికి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటు అని అన్నారు. కూటమిలో పెద్దన్నగా చెప్పుకొనే చంద్రబాబు గారు నోరు మెదపక పోవడం ఆయన పాలన తీరుకి నిదర్శనం అంటూ ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!