స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం

స్ప‌ష్టం చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

విజ‌య‌వాడ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రించి ఆనాడు అక్ర‌మంగా బ‌నాయించిన ఏపి స్కిల్ స్కాం కేసు పూర్తిగా వీగి పోయింద‌న్నారు. స్కిల్ కేసులో సీఎం చంద్రబాబు నాయుడుకు ఈడీ క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో న్యాయం, ధర్మం గెలిచినట్ల‌యింద‌న్నారు వాసం శెట్టి సుభాష్. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందన్నారు. అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడలేవని ఈ తీర్పుతో వెల్ల‌డైంద‌న్నారు. ఏపీ స్కిల్ కేసుతో చంద్రబాబుకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం లేదని ఈడీ స్పష్టంగా పేర్కొనడం కీలక పరిణామం అన్నారు వాసం శెట్టి సుభాష్.

రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసులన్నీ ఒక్కొక్కటిగా కూలి పోతున్నాయన్నారు . ఇప్పటికే ఏపీ సీఐడీ కూడా చంద్రబాబు పాత్ర లేదని తేల్చడమే దానికి నిదర్శనం అన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు ఉపసంహరించు కోవడంతో గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేయ‌డం చెంప పెట్టు లాగా మారింద‌న్నారు వాసంశెట్టి సుభాష్‌. చంద్రబాబు నాయుడి నిజాయితీ, విజనరీ పాలన, పరిపాలనా దక్షతపై మరోసారి రుజువైందన్నారు. ముఖ్య‌మంత్రి నాయకత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని అభిప్రాయం వ్య‌క్తం చేశారు కార్మిక శాఖ మంత్రి. గతంలో కొలువు తీరిన జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ ఏపీ రాష్ట్రాన్ని అన్ని ర‌కాలుగా నిర్వీర్యం చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే ప్ర‌జ‌లు 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని, అయినా బుద్ది రావ‌డం లేద‌న్నారు వాసం శెట్టి సుభాష్‌.

Leave A Reply

Your Email Id will not be published!