విశాఖపట్నం జిల్లా : ఏపీ రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో ‘మానవ అక్రమ రవాణా – బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం-1976’ పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ను ప్రారంభించి ప్రసంగించారు. సమాజంలో చట్టాలు, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర ఎంతో బాధ్యతాయుతమైనదని అన్నారు అనిత వంగలపూడి. పోలీసు వ్యవస్థ , న్యాయ వ్యవస్థ సమన్వయంతో పని చేసినప్పుడే బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరుతుందని పేర్కొన్నారు అనిత. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టం అవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో ‘ఆపరేషన్ ట్రేస్’ ద్వారా ఇప్పటి వరకు 900 మంది చిన్నారులను రక్షించడం జరిగిందన్నారు.
అలాగే వివిధ దేశాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన 180 మందిని సురక్షితంగా వెనక్కి తీసుకు వచ్చామని తెలిపారు మంత్రి. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ రాకుండా కఠిన శిక్షలు పడేలా చేయడంలో అధికారులు చూపుతున్న చొరవ అభినందనీయం అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్, ప్రాసిక్యూషన్ విభాగాల్లో అత్యాధునిక సాంకేతికతపై శిక్షణ ఇస్తూ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు వంగలపూడి అనిత. ఈ కార్యక్రమంలో వివిధ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సత్కరించి, వారికి అవార్డులు అందజేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రామకోటేశ్వరరావు , రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సుమారు 200 మంది అధికారులు పాల్గొన్న ఈ వర్క్‌షాప్, మానవ అక్రమ రవాణా నిర్మూలనలో కీలక మార్పులకు నాంది కావాలని ఆకాంక్షించారు మంత్రి.
