వటపత్రశాయి అలంకారంలో జనహిత రాముడు

అంగ‌రంగ వైభ‌వంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు భక్తిరసంతో నిండి పోయింది.

అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
పురాణాల ప్రకారం జలప్రళయం సంభవించినప్పుడు శ్రీమహా విష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆనందంగా కనిపిస్తారు. ఆ దివ్యరూపాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు.

భక్తుల కష్టాలను తొలగించి రక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా సందేశం ఇస్తున్నారని పండితులు తెలిపారు. వటపత్రశాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో కూడా విశేషంగా వర్ణించారు. ఈ వాహనసేవలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, ఆలయ అర్చకులు, అధికారులు , విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!