అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూ మాతను రక్షించడంపై దృష్టి సారించాలని , రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు వాతావరణాన్ని రక్షించు కోవచ్చని తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో 50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికలపై అటవీ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ అంశాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్యల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. గ్రీన్ కవర్ పెంపులో ఉద్యాన శాఖ పాత్ర, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం తదితర అంశాలపై ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు.
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధన అంశాలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు పవన్ కళ్యాణ్. అందుకోసం అన్ని ప్రభుత్వ రంగ శాఖలు అటవీ శాఖతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. గ్రీన్ కవర్ ఏర్పాటులో ఉద్యానవన శాఖ పాత్ర కీలకం అని చెప్పారు. ఉద్యాన పంటల సాగులో వైవిధ్యం తీసుకు రావడం ద్వారా అటు రైతుకీ, ఇటు భూమికీ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకే పంటలో వివిధ రకాల జాతుల మొక్కలు అంతర పంటలుగా సాగు చేసే విధంగా రైతులను పోత్సహించాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. సింథటిక్ మందుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలని అన్నారు. తద్వారా భూమికి చేవ పెరుగుతుందని అన్నారు.
